Monday, August 22, 2011

LONG LIVE ANNA

ఇపుడు జగమంతా ఒక్కటే మంత్రం. అదే అన్నా హజారే మంత్రం. అవును ఓ గాంధేయవాది నిస్వార్థంగా చేపట్టిన పోరాటం- యావత్‌ జాతిని కదిలించింది. కులమత భేదాలు లేకుండా, వయోపరిమితి భేదాలు లేకుండా అందర్నీ ఒక్క తాటిపైకి తెచ్చింది. ముఖ్యంగా యూపీఏ-2 సర్కార్‌ అధికారంలోకి వచ్చాక దేశంలో అవినీతి విచ్చలవిడిగా జరిగింది. రాజకీయ రాబందులు జాతి సంపదను దోచుకున్నారు. మనకళ్లముందే వేల కోట్ల రూపాయల గుటకాయ స్వాహా అయిపోయాయి. ఇవన్నీ చూస్తూ మనమనంతా ఊరుకున్నాం. మనకెందుకులే అని కళ్లుమూసుకున్నాం. కానీ న్యాయవ్యవస్థ, జాతీయ మీడియా అవినీతి కూపాన్ని బయటకు లాగాయి.
సంకీర్ణధర్మం అంటూ మన ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ వేదాలు వల్లిస్తుంటే- రాజా, కనిమొళి, కల్మాడీ తదితరులు కోట్లు మేశారు. కర్ణాటకలోనూ ఇదే జరిగింది. కానీ అక్కడి లోకాయుక్త చేసిన మేలు వల్ల కొంత న్యాయం జరిగింది. అవినీతి యడ్యూరప్ప తన సీఎం కుర్చీని వదిలిపెట్టక తప్పలేదు. బలమైన లోకాయుక్త, లోకపాల్‌ వ్యవస్థలు ఉంటే రాష్త్రాలు, దేశం అవినీతి కోరల నుంచి బయటపడతాయి.

లోకపాల్‌ చట్టం పరిధిలోకి ప్రధాని మంత్రేకాదు న్యాయవ్యవస్థ కూడా ఉండాలనేదే అన్నా హజారే డిమాండ్‌. అదే కేంద్రానికి, ఇతర జాతీయ పార్టీలకు నప్పడం లేదు. న్యాయవ్యవస్థకూ ఇటీవల కొందరు మచ్చతెచ్చారు. వారంతా లోకపాల్‌కు జవాబుదారులే. అసలు కొంతకాలంగా ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఏం చేస్తున్నారో అంతుబట్టడం లేదు. ఆయన కొందరి చేతిలో కీలుబొమ్మగా మారినట్టు స్పష్టమవుతోంది. కాకపోతే మరేమిటి, ఎంతో మేధావిగా పేరు తెచ్చుకున్న పీఎం- ఈరోజు తలదించుకోవాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది? లోకపాల్‌ బిల్లు పరిధిలోకి ప్రధాని ఉండటంలో త ప్పులేదని ఆయన చెబుతున్నా, కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు ఎందుకు జంకుతున్నారు? అంటే- ప్రధానికి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందా?
నిజానికి గత వారం రోజులుగా భారతీయ మీడియాలో అన్నా వార్తలే. ఆయనకు మద్దతుగా దేశమంతా ర్యాలీలు. మొదట్లో లైట్‌ తీసుకున్న కేంద్రం ఇపుడు భయంతో వణికిపోతోంది. అన్నా తీసుకొచ్చిన విప్లవం చూసి పెద్దలు ఆందోళన చెందుతున్నారు. ఆయన్ను ఎలా లొంగదీసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. తీహార్‌ జైలుకు పంపి నాలుక కర్చుకున్న కేంద్రం ఇపుడు అన్నా ముందు దోషిగా నిలబడింది. నిజంగానే దేశంలో ఇపుడు రెండో స్వాతంత్య్ర పోరాటం చేస్తోంది. అవినీతిని తరిమికొట్టే సమయం ఆసన్నమైంది.
ఇంక్విలాబ్‌ జిందాబాద్‌, అన్నా జిందాబాద్‌.  జైబోలో భారత్‌మాతాకీ జై!