Saturday, April 2, 2011

SALUTE TO MEN IN BLUE



యస్‌... ఇండియా రాక్స్‌... ఈ పదాలు రాస్తుంటే నా శరీరం పులకిస్తుంది. నా మనసు పరవశిస్తుంది. నా శ్వాస జయహో అంటోంది. అవును. ఎన్నాళ్లకెన్నాళ్లకు మన క్రికెట్‌ వీరులు మళ్లీ జగజ్జేతలయ్యారు. ఫైనల్లో మనం గెలుస్తామని నాకు ఎంతో ధీమా ఉంది. ఎందుకంటే- బ్యాటింగ్‌లో అద్భుతమైన ఆటతీరును కనబరుస్తున్న మన  ఆటగాళ్లు...నాకౌట్‌లోకి ప్రవేశించేసరికి జగదేకవీరుడి వలె ప్రత్యర్థిని చిత్తుచేశారు. బౌలర్లు చెలరేగితే, ఫీల్డర్లు మైదానంలో పాదరసంలా జారారు. మనవాళ్లు పులిలా వేటాడుతుంటే ప్రత్యర్థులు జింక పిల్లల్లా చెల్లాచెదురయ్యారు. ఫైనల్‌ ప్రత్యర్థి శ్రీలంక మనతో సమఉజ్జీగా నిలిచే జట్టే కానీ, 275 పరుగుల విజయలక్ష్యం మనవారికి చాలా చిన్నది. ఎందుకంటే- పిచ్‌లో బౌలర్లకు పెద్దగా ఏమీ లేదు. కాబట్టే నేను ధీమాగా ఉన్నాను. అందరికీ ఇండియాదే ట్రోఫీ అని చెప్పాను. అదే నిజమైంది. ఆ తర్వాత భారతావని జనసంద్రంగా మారింది. అందరూ వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. బాణాసంచా కాల్చారు. మా ఇంట్లోనూ పిల్లలు దీపావళి జరిపారు.






ఇవన్నీ చూస్తుంటే నాకు చిన్ననాటి తీపి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. 1983 జూన్‌ 25వ తేదీ నాకు బాగా గుర్తు. కలర్‌ టీవీలు అప్పుడప్పుడే వచ్చాయి. ఆ నాటి భారత్‌-వెస్టిండీస్‌ టైటిల్‌ ఫైట్‌ను నేను కళ్లారా చూశాను. ఇండియా విక్టరీ ఘడియలను బీబీసీ రేడియోలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ద్వారా విని ఉబ్బితబ్బిబ్బయ్యాను. ఒక్కో విండీస్‌ వికెట్‌ నేలకూలుతుంటే- నేను ఉద్వేగంతో కేరింతలు కొట్టాను. నాకోసం నా తండ్రి కూడా మేల్కొన్నారు. నన్ను ఉత్సాహపరిచారు. ఆ రోజు లార్డ్స్‌ మైదానం ఇండియా ఫ్యాన్స్‌తో నిండిపోయింది. ఇండియాలోనూ అందరూ ఇళ్లలోనే సంబరాలు చేసుకున్నారు.

0 comments:

Post a Comment